భారత్‌లో తొలిసారి.. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్

University of London to Open Hyderabad Campus in India
  • ఫ్యూచర్ సిటీలో శాశ్వత ప్రాంగణం.. తాత్కాలికంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్
  • 2027-28 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం
  • హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వ అడుగులు
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'యూనివర్సిటీ ఆఫ్ లండన్' తమ తొలి భారతీయ ఆఫ్‌షోర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఐటీ, బయోటెక్ రంగాల్లో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నగర కీర్తి కిరీటంలో ఈ పరిణామం మరో కలికితురాయిగా నిలవనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలోని ఎడ్యుకేషన్ జోన్‌లో ఈ విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీని నిర్మాణం పూర్తయ్యే వరకు, నగరం నడిబొడ్డున ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను తాత్కాలిక ప్రాంగణంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. 2027-28 విద్యా సంవత్సరం నాటికి కోర్సులను ప్రారంభించే లక్ష్యంతో వర్సిటీ ప్రతినిధులు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు (యూజీసీ) దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేశారు.

1836లో స్థాపించిన యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూకేలోని అత్యంత పురాతన ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ఒకటి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-500లోపు ఉన్న విదేశీ వర్సిటీలనే భారత్‌లో అనుమతించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు ఇది పూర్తిస్థాయిలో అనుగుణంగా ఉంది. లండన్ బిజినెస్ స్కూల్, కింగ్స్ కాలేజ్ వంటి 17 ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సమాఖ్యగా ఇది పనిచేస్తోంది.

తెలంగాణను అన్ని రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా నిలపాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 13 ప్రతిష్ఠాత్మక యూకే పాఠశాలల ప్రతినిధులు కూడా హైదరాబాద్‌లో తమ శాఖల ఏర్పాటుకు ఆసక్తి చూపారు. ఈ పరిణామంతో స్థానిక విద్యార్థులు తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్యను పొందడంతో పాటు, నగరంలోని ఐటీ, బయోటెక్ సంస్థలకు నైపుణ్య మానవ వనరులు మరింతగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
Go Back to Shorts
University of London
Hyderabad
Telangana
India
Global Education Hub
Bharat Future City
UK Universities
Revanth Reddy
Education
Foreign Universities

More Telugu News