సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
- గంటలో మూడుసార్లు దాడులు.. ఇద్దరు బాలురకు గాయాలు
- బంకర్లలో తలదాచుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలు
- సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణ
గంట వ్యవధిలోనే ఇరాన్ మూడుసార్లు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. ఈ దాడులను ఎదుర్కొనేందుకు తమ రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలన్న షరతుతో ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడులను ట్రంప్ రెండు వారాల పాటు వాయిదా వేశారు. ఈ ఒప్పంద ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ దాడులకు దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.
ఈ దాడుల వల్ల జెరూసలేం, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. జెరూసలేంకు దక్షిణంగా ఉన్న టెల్ షెవ్ పట్టణంలో ఇద్దరు 15 ఏళ్ల బాలురు స్వల్పంగా గాయపడినట్లు ‘మాగెన్ డేవిడ్ అడొమ్’ అత్యవసర సేవా సంస్థ తెలిపింది. సైనిక హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాంతి దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇరాన్ ఈ దాడులకు పాల్పడటంతో పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇరాన్ వైఖరిపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.