Donald Trump: మా వాడిని రక్షించాం.. అమెరికా సైనిక చరిత్రలోనే సాహసోపేతమైన రెస్క్యూ: ట్రంప్

Trump Confirms Rescue of US Pilot in Iran Calls it Historic
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌లో కూలిపోయిన అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌లోని రెండో పైలట్‌ను కూడా విజయవంతంగా రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అమెరికా సైనిక చరిత్రలోనే ఇది అత్యంత సాహసోపేతమైన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటని ఆయన అభివర్ణించారు.

దాదాపు రెండు రోజులుగా గల్లంతైన ఈ పైలట్‌ను శత్రు భూభాగంలో తీవ్ర పోరాటం అనంతరం గుర్తించి రక్షించినట్లు అంతకుముందు అల్ జజీరా కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. "మా వాడిని రక్షించాం! అమెరికా సైన్యం అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి, మన అధికారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. ఆయన సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను" అని ట్రంప్ పోస్ట్ చేశారు.

"ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వత ప్రాంతాల్లో శత్రువులు అతడిని వేటాడుతుండగా, గంటగంటకు వారు సమీపిస్తున్నా.. మా సైనికాధికారులు 24 గంటలూ అతడిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. నా ఆదేశాల మేరకు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాలతో కూడిన డజన్ల కొద్దీ విమానాలను పంపి ఆయన్ను కాపాడాం. ఆయనకు గాయాలయ్యాయి. కానీ, త్వరలోనే కోలుకుంటారు" అని ట్రంప్ వివరించారు.

కొన్ని రోజుల క్రితం జెట్ కూలిపోగా, ఒక పైలట్‌ను వెంటనే రక్షించారు. అయితే, రెండో పైలట్‌ను రెస్క్యూ ఆపరేషన్‌కు ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతో ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ట్రంప్ తెలిపారు. శత్రు భూభాగంలో ఇద్దరు పైలట్లను వేర్వేరుగా, సురక్షితంగా కాపాడటం సైనిక చరిత్రలో ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్‌లో ఒక్క అమెరికన్ సైనికుడికి కూడా హాని జరగలేదని, ఇది ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యాన్ని రుజువు చేస్తోందని పేర్కొన్నారు.

మరోవైపు మధ్య ఇరాన్‌లోని కోగిలుయే అండ్ బోయర్-అహ్మద్ ప్రావిన్స్‌లో ఈ విమానం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. గల్లంతైన పైలట్ ఆచూకీ తెలిపిన వారికి ఇరాన్ ప్రభుత్వం 60,000 డాలర్ల రివార్డు కూడా ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయడం గమనార్హం.
Go Back to Shorts
Donald Trump
Iran
US Military
F-15E Strike Eagle
rescue operation
military operation
fighter jet
American pilot
Kogiluyeh and Boyer-Ahmad
Truth Social

More Telugu News