భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు

Indian Railways Key Decision Changes in Ticket Refund Rules
  • రైల్వే టికెట్ రద్దు, రిఫండ్ నిబంధనల్లో కీలక మార్పులు
  • రైలు బయల్దేరడానికి 8 గంటలలోపు రద్దు చేస్తే రిఫండ్ సున్నా
  • 8 నుంచి 24 గంటల మధ్య రద్దుకు టికెట్ ధరలో 50 శాతం కోత
  • ఏజెంట్ల దందాకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త విధానం
  • ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు
భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది.

ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే తిరిగి వస్తుంది. అదేవిధంగా, 24 గంటల నుంచి 72 గంటల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం కోత విధించి, 75 శాతం మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఒకవేళ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్‌ను రద్దు చేస్తే కేవలం సాధారణ రద్దు ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి.

టికెట్ ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి, చివరి నిమిషంలో రద్దుచేయడాన్ని అరికట్టేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు చివరి నిమిషంలో కూడా బెర్తులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు కానున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
 
Advertisement
Indian Railways
railway ticket refund
IRCTC refund rules
train ticket cancellation
railway refund policy
Indian Railways new rules
train ticket booking
railway ticket agents
confirmed ticket refund
railway travel

More Telugu News