Google: ఇక టైపింగ్ అవసరం లేదు... మాట్లాడితే చాలు, గూగుల్ సమాధానం చెబుతుంది!

Google Search Live Now in Telugu and Other Indian Languages
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త ‘సెర్చ్ లైవ్’ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఇప్పటికే ఇంగ్లీష్, హిందీలో ఉన్న ఈ సేవలను ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా మరో 9 భారతీయ భాషల్లో విస్తరించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాయిస్, కెమెరా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో నేరుగా సంభాషిస్తూ, ఆడియో రూపంలో సమాచారాన్ని పొందవచ్చు.

జెమిని 3.1 ఫ్లాష్ లైవ్ అనే కొత్త ఆడియో, వాయిస్ మోడల్ ద్వారా ఈ సేవలను అందిస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. దీంతో మరింత సహజంగా, సులభంగా తమకు నచ్చిన భాషలో సెర్చ్‌తో మాట్లాడవచ్చని కంపెనీ తెలిపింది. టైప్ చేయడం కష్టంగా అనిపించినప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు తమ గూగుల్ యాప్‌లో సెర్చ్ బార్ కింద ఉన్న ‘లైవ్’ ఐకాన్‌పై ట్యాప్ చేసి దీన్ని ఉపయోగించుకోవచ్చు.

ప్రశ్నలను గట్టిగా అడిగితే ఆడియో రూపంలో సమాధానాలు వస్తాయి. అవసరమైతే మరిన్ని వివరాల కోసం వెబ్ లింకులు కూడా కనిపిస్తాయి. మన కళ్ల ముందు ఉన్న వస్తువుల గురించి తెలుసుకోవాలంటే కెమెరా ఆన్ చేసి చూపించవచ్చు. ఉదాహరణకు, ఒక కొత్త షెల్ఫ్‌ను ఎలా బిగించాలో కెమెరా ద్వారా చూపిస్తే, ఏఐ దాన్ని చూసి సూచనలు ఇస్తుంది. 

గూగుల్ లెన్స్ ద్వారా కూడా ‘లైవ్’ ఆప్షన్ ఎంచుకుని వస్తువులతో నేరుగా సంభాషించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఇటీవల భారత ప్రభుత్వం గూగుల్, యూట్యూబ్‌తో కలిసి జాతీయ స్థాయిలో ఏఐ నైపుణ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ఆధ్వర్యంలో మీడియా, క్రియేటివ్ రంగాలకు చెందిన 15,000 మందికి ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
Go Back to Shorts
Google
Search Live
AI
Artificial Intelligence
Gemini 3.1 Flash Live
Indian Languages
Google Lens
IICT
AI Skills Program
Voice Search

More Telugu News