Colombia plane crash: కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం

Colombia plane crash kills 66 near Ecuador border
షార్ట్స్‌లో చూడండి
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొలంబియన్ వైమానిక దళానికి చెందిన ఓ విమానం ఈక్వెడార్ సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది సిబ్బంది, ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనిక సిబ్బందితో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 120 మంది ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు పలువురిని కాపాడినట్లు తెలుస్తోంది.

విమానం భూమిని ఢీకొట్టడానికి ముందు గాల్లోనే అదుపు తప్పి వేగంగా పల్టీలు కొడుతూ కిందకు పడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికులు తీసిన వీడియోలో ఈ భయానక దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. కొలంబియా ప్రభుత్వం ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనా స్థలంలో విమాన బ్లాక్ బాక్స్ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ విషాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో దేశంలో విమాన ప్రయాణాల భద్రతా ప్రమాణాలు, పాత విమానాల నిర్వహణపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది.
Go Back to Shorts
Colombia plane crash
Colombian Air Force
Ecuador border
military plane crash
plane accident
aviation accident
South America news
plane crash victims
air safety
black box

More Telugu News