Hand pump: మరీ ఇంత నిర్లక్ష్యమా.. యూపీలో నడి రోడ్డులో చేతిపంపు.. వీడియో ఇదిగో!

Mirzapur UP Road Built Around Hand Pump Video Goes Viral
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. మీర్జాపూర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన ఓ సిమెంట్ రోడ్డుకు సరిగ్గా మధ్యలో చేతిపంపును వదిలేసి నిర్మాణం పూర్తి చేశారు. ఇంజనీర్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మీర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల సిమెంట్ రోడ్డు పనులు చేపట్టారు.

అయితే, రోడ్డు మధ్యలో ఉన్న చేతిపంపును తొలగించకుండా, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు దాని చుట్టూనే కాంక్రీట్ వేసి పనులు ముగించేశారు. దీంతో ఆ పంపు ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా, ప్రమాదకరంగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులు దీనిని గమనించకపోతే ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అధికారుల పనితీరుపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘రోడ్డుపై వెళ్తూనే దాహం తీర్చుకోవచ్చు’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రజల భద్రతను గాలికొదిలిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేతిపంపును తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
Go Back to Shorts
Hand pump
Mirzapur
Uttar Pradesh
Road construction
Negligence
Government officials
Viral video
Public safety
Civil engineering
Accident risk

More Telugu News