Ramulu: అకాల వర్షాల కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురి బలి

Telangana AP Rains Four Killed in Lightning Strikes
షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

పిడుగుపాటుకు గురై మరణించిన వారిలో తెలంగాణలోని వనపర్తి జిల్లా మేడపల్లికి చెందిన మిరప రైతు రాములు (27), ఏపీలోని బాపట్ల జిల్లా రాచూరుకు చెందిన కౌలురైతు వనజ (35) ఉన్నారు. వీరితో పాటు పల్నాడు జిల్లా కొత్త నాగిరెడ్డిపల్లికి చెందిన కూలీ సుబ్బరత్తమ్మ (55), గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కె.శ్రీనివాసరావు (40) కూడా మృతి చెందారు.

ఈ అకాల వర్షం మూగజీవాల పాలిట కూడా శాపంగా మారింది. వికారాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఒకేచోట సుమారు 300 మేకలు మృత్యువాత పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈదురు గాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. కళ్ళాల్లో ఆరబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదిలా ఉండగా, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న రెండు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగావ్‌లో అత్యధికంగా 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Ramulu
Telangana rains
hailstorm
lightning strikes
crop damage
Vanaja
Subbarathamma
Srinivasarao
Hyderabad Meteorological Center
heavy rainfall warning

More Telugu News