Indian Rupee: డాలర్ జోరు.. రూపాయి బేజారు.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనం

Indian Rupee plunges to record low against the Dollar
షార్ట్స్‌లో చూడండి
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మరోసారి చరిత్రాత్మక కనిష్ఠానికి పడిపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో రూపాయి విలువ 92.63 వద్ద ఆల్ టైమ్ క‌నిష్ఠ‌ స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల తరలింపు కొనసాగడం వంటి అంశాలు రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో ఈరోజు ఉదయం 92.42 వద్ద ప్రారంభమైన రూపాయి, ఆ తర్వాత మరింత బలహీనపడింది. మంగళవారం రూపాయి 92.37 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కీలకమైన 92.50 స్థాయిని దాటి కిందకు పడటంతో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని, దీనికి తోడు బ్యాంకు సెలవుల కారణంగా డాలర్ల లభ్యత తక్కువగా ఉండటం కూడా రూపాయి పతనానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ వివరించారు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ భారీగా ఉందని ఆయన తెలిపారు.

మరోవైపు పెరుగుతున్న దిగుమతుల బిల్లుల కారణంగా రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల అధిక ముడి చమురు ధరలు, హ‌ర్మూజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయాలు కలగడం వంటి అంశాలు భారత్‌కు దిగుమతి వ్యయాన్ని పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థూల ఆర్థిక పరిస్థితులు రూపాయికి ప్రతికూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డాలర్‌తో రూపాయి విలువ 92.25 నుంచి 92.95 శ్రేణిలో కదలాడవచ్చని త్రివేది అంచనా వేశారు.
Go Back to Shorts
Indian Rupee
Rupee
USD to INR
Dollar vs Rupee
Rupee fall
Indian economy
Forex market
Hormuz Strait
Crude oil prices
Rupee all time low

More Telugu News