Mamata Banerjee: ఏమిటీ అర్ధరాత్రి బదిలీలు...? కేంద్ర ఎన్నికల సంఘంపై మమత ఆగ్రహం

Mamata Banerjee Angered by Midnight Transfers by Election Commission
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్‌లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వేళ ఈ బదిలీలు చేపట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు.

సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జేపీ మీనాలతో పాటు డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ఈసీ బదిలీ చేసింది. దీనిపై మమత ఘాటుగా స్పందించారు. "అర్ధరాత్రి ఒంటి గంటకు నాకు మెసేజ్ వచ్చింది. ఇలాంటి చర్యలు ఎప్పుడైనా చూశారా? చీఫ్ సెక్రటరీ ఒక బెంగాలీ మహిళ. ఆమెను తొలగించారు. వీళ్లు బెంగాలీలకు, మహిళలకు వ్యతిరేకులు" అంటూ కేంద్రంపై మండిపడ్డారు.

గతంలో అధికారుల బదిలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముగ్గురి పేర్లతో జాబితాను ఈసీ కోరేదని, కానీ ఈసారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మమత ఆరోపించారు. "ఇదేమైనా ఢిల్లీ లడ్డూ అనుకుంటున్నారా? ఇది వాళ్ల జాగీరా?" అని ప్రశ్నించారు. డీజీపీగా ఉన్న పీయూష్ పాండే బెంగాలీ కాదని, ఆయనను కూడా తొలగించారని గుర్తు చేశారు. బీజేపీకి అనుకూలంగా పనిచేసే వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు.

వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. "మీరు అన్నీ మార్చండి.. అయినా సరే బెంగాల్‌లో ప్రభుత్వం మారదు. ఇది నా మాట" అని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి శశి పంజా ఇంటిపై దాడి జరిగినట్లే, తన నివాసంపై కూడా దాడి చేసే అవకాశం ఉందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. "ధైర్యం ఉంటే వచ్చి దాడి చేయండి. మేం ఎదుర్కొంటాం" అని సవాల్ విసిరారు. అదే సమయంలో, ప్రజలు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే చర్యలకు లొంగవద్దని సూచించారు.
Go Back to Shorts
Mamata Banerjee
West Bengal
Election Commission
ECI
officials transfer
midnight transfers
BJP
Nandini Chakravarti
JP Meena
Piyush Pandey

More Telugu News