Delhi Cantt Railway Station: ఢిల్లీ కంట్ రైల్వే స్టేషన్‌లో పాక్ గూఢచర్యం.. రహస్య కెమెరాతో లైవ్ ఫుటేజ్!

Delhi Cantt Railway Station Pakistan Espionage Racket Exposed
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారీ గూఢచర్య ముఠా గుట్టురట్టయింది. ఈ రాకెట్ వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ఘజియాబాద్ పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఢిల్లీ కంట్ రైల్వే స్టేషన్‌లో నిందితులు రహస్య కెమెరాను అమర్చి, పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు లైవ్ ఫుటేజ్ పంపినట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్ల నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు అందుకుని, దేశంలోని సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఒక్కో అసైన్‌మెంట్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు తీసుకున్నట్లు తెలిపారు. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని రైల్వే స్టేషన్లు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ మోహరింపు పాయింట్లు, రక్షణ శాఖ కార్యాలయాలు, భద్రతా ఏజెన్సీల కదలికలను వీరు వీడియో తీసి పంపినట్లు పోలీసులు కనుగొన్నారు.

నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అధికార రహస్యాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు కొంత డేటాను డిలీట్ చేయగా, దాన్ని తిరిగి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు మరికొంత మందిని నియమించుకోవాలని కూడా నిందితులు ప్రయత్నించినట్లు తెలిసింది.

ఢిల్లీ కంట్ వంటి కీలక రైల్వే స్టేషన్ నుంచి నేరుగా లైవ్ ఫుటేజ్ పాకిస్థాన్‌కు చేరడం అత్యంత ఆందోళనకరమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి ఉగ్రదాడులకు ప్లాన్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Go Back to Shorts
Delhi Cantt Railway Station
Pakistan espionage
Delhi
Ghaziabad police
Indian Railways
espionage racket
security breach
live footage
RPF
GRP

More Telugu News