అమరావతిలో బిట్స్ పిలాని ఏఐ క్యాంపస్.. ప్లాన్లను పరిశీలించిన మంత్రి నారా లోకేశ్
- రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో క్యాంపస్ నిర్మాణం
- మొత్తం 7 వేల మంది విద్యార్థులకు ఏఐ, డేటా సైన్స్ కోర్సులు
- దేశంలోనే ఇది తొలి ఏఐ క్యాంపస్ కానుందని తెలిపిన ప్రతినిధులు
- క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ సూచన
ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, రెండు దశల్లో 7 వేల మంది విద్యార్థులకు విద్యనందించేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో దీనిపై రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో దీనిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి కోర్సులతో పాటు వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పర్యావరణహితంగా గ్రీన్ బిల్డింగ్, పునరుత్పాదక ఇంధన విధానాలతో నిర్మాణం చేపడుతున్నామని, పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంపస్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని వారికి సూచించారు.





