Kakani Govardhan Reddy: పరకామణి చోరీలో అసలు సూత్రధారులను విచారించకుండా కేసును నీరుగారుస్తున్నారు: కాకాణి గోవర్ధన్

Parakamani Theft Case Being Diluted Alleges Kakani Govardhan Reddy
  • పరకామణి చోరీ ఉదంతం భద్రతా వైఫల్యానికి నిదర్శనమన్న కాకాణి
  • 2024లో పెంచలయ్య చోరీకి పాల్పడితే ఆ విషయం బయటకు రాకుండా చేశారని విమర్శ
  • అసలు నిజాలను భక్తుల ముందు పెట్టాలని డిమాండ్

తిరుమల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టీటీడీని ఒక వేదికగా వాడుకుంటున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.


పరకామణిలో జరిగిన బంగారం చోరీ ఉదంతం భద్రతా వైఫల్యానికి నిదర్శనమని కాకాణి పేర్కొన్నారు. నిందితుడు పెంచులయ్య 2024 చివరలో చోరీకి పాల్పడితే, ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. "శ్రీవారి పరకామణిలో దొంగిలించిన నగలను కార్పొరేట్ దుకాణాల్లో మార్పిడి చేయడమే కాకుండా, బ్యాంకుల్లో ఆ నగలను తాకట్టు పెట్టి రుణాలు కూడా పొందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?" అని ఆయన ప్రశ్నించారు. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను విచారించకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు.


టీటీడీలో గోశాల నిర్వహణ, లడ్డూ ప్రసాదం వివాదం నుంచి బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యక్తిగత అంశాల వరకు వరుస సంఘటనలు తిరుమల ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయని కాకాణి విమర్శించారు. పరకామణి కేసులో నిందితుడు పెంచలయ్యకు 2025లో బెయిల్ మంజూరు చేయడం వెనుక ఉన్న శక్తులెవరో తేలాలన్నారు. ఇదే తరహా కేసులో గతంలో రవికుమార్ అనే నిందితుడు తన ఆస్తులను శ్రీవారికి రాసిచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుత నిందితుడి వెనుక ఉన్న వారిని ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. శ్రీవారి ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి దాపురించిందని, తక్షణమే ఈ చోరీపై సమగ్ర విచారణ జరిపి నిజాలను భక్తుల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Kakani Govardhan Reddy
Tirumala
TTD
Parakamani theft
Chandrababu Naidu
BR Naidu
Andhra Pradesh politics
Temple theft
Panchulaiah
YSRCP

More Telugu News