Narendra Modi: యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావు: ప్రధాని మోదీ

Narendra Modi Says War Not Solution to Problems
  • ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు
  • చర్చలు, దౌత్యంతోనే సమస్యలకు పరిష్కారం అని ఉద్ఘాటన 
  • ఉగ్రవాద నిర్మూలనే ఇరువురి ఉమ్మడి లక్ష్యం అని ప్రకటన
  • వలసలు, మొబిలిటీపై భారత్, ఫిన్లాండ్ కీలక ఒప్పందం
  • విద్యా రంగంలో పరస్పర సహకారానికి నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ మరోసారి శాంతి మంత్రం జపించింది. కేవలం సైనిక చర్యలతో ఏ సమస్యా పరిష్కారం కాదని, చర్చలు, దౌత్యమే సరైన మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గురువారం నాడు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో నెలకొన్న ఘర్షణలను ముగించేందుకు జరిగే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ హామీ ఇచ్చారు. చట్టం, న్యాయం, ప్రజాస్వామ్య విలువలపై భారత్, ఫిన్లాండ్‌లకు ఒకే రకమైన అభిప్రాయం ఉందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ నిర్మూలించడమే తమ ఉమ్మడి లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ 'ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్' పూర్తి చేయడాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మీరు ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ పూర్తి చేశారు.. మీలాంటి శక్తివంతమైన నాయకత్వంతో భారత్, ఫిన్లాండ్ కూడా ఇన్నోవేషన్, డిజిటల్, సస్టైనబిలిటీ అనే కొత్త 'ట్రయాథ్లాన్'ను సాధిస్తాయని నాకు నమ్మకం ఉంది" అని మోదీ చమత్కరించారు.

కొత్త శకంలో భారత్-యూరప్ బంధం
ప్రస్తుతం ప్రపంచం అస్థిరత, అనిశ్చితి మధ్య ఉందని, ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని రెండు పెద్ద దౌత్య శక్తులైన భారత్, యూరప్ మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని ఆయన అభివర్ణించారు. 2026 ప్రారంభంలో కుదిరిన చారిత్రాత్మక 'ఇండియా-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఒప్పందం ద్వారా భారత్, ఫిన్లాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కీలక ఒప్పందాలపై సంతకాలు
ఇరు దేశాల మధ్య ఆవిష్కరణల వ్యవస్థను అనుసంధానించేందుకు సమగ్ర 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ' (వలసలు మరియు రాకపోకల) ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ప్రధాని ప్రకటించారు. భారతీయ విద్యార్థులకు, ప్రతిభావంతులకు ఫిన్లాండ్ ఇప్పుడు ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా మారుతోందన్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య పరిశోధనలు, స్టార్టప్ సహకారం మరింత బలపడుతుందని తెలిపారు. విద్యా రంగంలో ఫిన్లాండ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడిన మోదీ.. ఉపాధ్యాయ శిక్షణ, స్కూల్-టు-స్కూల్ భాగస్వామ్యం, భవిష్యత్ విద్యా విధానాలపై సహకారాన్ని విస్తరించుకోవడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. నార్డిక్ ప్రాంతంలో ఫిన్లాండ్ భారత్‌కు ముఖ్యమైన భాగస్వామి అని, ఆర్కిటిక్, ధృవ ప్రాంతాల పరిశోధనల్లోనూ తమ సహకారం కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు.


Narendra Modi
Finland
Alexander Stubb
India Finland relations
Ukraine war
West Asia conflict
diplomacy
international relations
trade agreement
migration and mobility

More Telugu News