యుద్ధ భయాలతో మార్కెట్ల 'బ్లడ్ బాత్'.. నిమిషాల్లో రూ. 6.6 లక్షల కోట్లు ఆవిరి!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- నిమిషాల్లోనే రూ. 6.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
- రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి.. పెరిగిన ముడి చమురు ధరలు
- ఆటో, విమానయాన రంగాల షేర్లు భారీగా పతనం
- నష్టాల మార్కెట్లోనూ లాభపడిన రక్షణ రంగ షేర్లు
ట్రేడింగ్ ప్రారంభమైన తొలి నిమిషాల్లోనే సెన్సెక్స్ ఒకానొక దశలో 1,600 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా కీలకమైన 24,500 స్థాయికి దిగజారింది. ఈ భారీ అమ్మకాల ఒత్తిడితో కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 6.6 లక్షల కోట్లు హరించుకుపోయింది. యుద్ధం కారణంగా గల్ఫ్ నుంచి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరింది. దీని ప్రభావంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 91.50కి పడిపోయింది. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావంతో ఆటోమొబైల్, విమానయానం, పెయింట్స్, కెమికల్స్ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. అయితే, మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉన్నప్పటికీ రక్షణ రంగ షేర్లు మాత్రం లాభాల్లో దూసుకెళ్లాయి. యుద్ధం కారణంగా ఆర్డర్లు పెరుగుతాయన్న అంచనాలతో భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL) వంటి షేర్లు లాభపడ్డాయి. మరోవైపు, ఈ యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరుస్తున్నాయి.