Chandrababu Naidu: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా వెనక్కి తీసుకురండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Naidu Orders Safe Return of AP People Stranded in Gulf
  • గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా రప్పించేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు
  • ఆర్టీజీఎస్, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ అధికారులతో సీఎం సమీక్ష
  • విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు
  • బాధితుల కోసం 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు
  • విమానాశ్రయాలు తెరుచుకునే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచన
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో చిక్కుకున్న ప్రయాణికులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.

యుద్ధం, విమాన సర్వీసుల రద్దు కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని వెంటనే గుర్తించి సహాయం అందించాలన్నారు. ఆయా దేశాల్లోని భారతీయ ఎంబసీలతో నిరంతరం టచ్‌లో ఉంటూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆర్టీజీఎస్, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు ఎవరూ ఆందోళన చెందవద్దని, విమానాశ్రయాలు తిరిగి తెరుచుకుని సర్వీసులు ప్రారంభమయ్యే వరకు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ కోఆర్డినేటర్ల ద్వారా అవసరమైన వారికి తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బాధితుల కోసం ప్రభుత్వం 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.

హెల్ప్‌లైన్ నెంబర్లు:
ఫోన్: 0863-2340678
వాట్సాప్: 85000 27678

అలాగే [email protected], [email protected] ఈమెయిల్స్ ద్వారా లేదా https://apnrts.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా సంప్రదించి తక్షణ సహాయం పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
Chandrababu Naidu
APNRTS
Andhra Pradesh
Gulf Countries
Stranded Indians
Middle East Conflict
Evacuation
Helpline Numbers
Kondapalli Srinivas
NRI Affairs

More Telugu News