Nara Lokesh: ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ తయారీ కంపెనీ.. రేపు నారా లోకేశ్ చేతులమీదుగా శంకుస్థాపన

Nara Lokesh to Inaugurate Blue Jet Healthcare Plant in Uttarandhra
  • రాంబిల్లి సెజ్‌లో బ్లూ జెట్ హెల్త్‌కేర్
  • రూ.2,300 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ
  • ఈ ప్రాజెక్టు ద్వారా 1,750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
  • మొత్తం 102.48 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో భాగంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటవుతోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బ్లూ జెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ (బీజేహెచ్ఎల్) తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.2,300 కోట్ల భారీ పెట్టుబడితో రానున్న ఈ పరిశ్రమకు రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు (ఫిబ్రవరి 28) శంకుస్థాపన చేయనున్నారు.

మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న బ్లూ జెట్ హెల్త్‌కేర్, శాస్త్ర ఆధారిత ప్రత్యేక ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీలో జాతీయ స్థాయిలో మంచి పేరున్న సంస్థ. ఈ సంస్థ రాంబిల్లి సెజ్‌లో ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, జడ్.చింతువ రెవెన్యూ పరిధిలోని సీతపాలెం వద్ద 102.48 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరాకు రూ.40 లక్షల చొప్పున భూమిని కేటాయించడంతో పాటు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అదనపు ప్రోత్సాహకాలను కూడా మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సంస్థ మొత్తం రూ.2,300 కోట్ల పెట్టుబడిని దశల వారీగా పెట్టనుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,750 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని బ్లూ జెట్ హెల్త్‌కేర్ లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ భారీ పెట్టుబడి రాకతో స్థానిక పారిశ్రామిక వాతావరణం మరింత బలోపేతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ప్రధాన పరిశ్రమకు అనుబంధంగా అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటై పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధునాతన ఫార్మాస్యూటికల్ తయారీ రంగంలో ఒక కీలక గమ్యస్థానంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Nara Lokesh
Blue Jet Healthcare
Andhra Pradesh
Pharmaceuticals
Uttarandhra
Rambilli SEZ
Anakapalli
AP Industries
AP Investments
Pharma Manufacturing

More Telugu News