Allu Arjun: మృణాల్‌తో సినిమా చేయాలనుంది: అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్

Allu Arjun Wants to Work with Mrunal Thakur
  • మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేసిన అల్లు అర్జున్
  • ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న బన్నీకి మృణాల్ ప్రత్యేక శుభాకాంక్షలు
  • తన ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసిన ఐకాన్ స్టార్
  • 'పుష్ప 2' చిత్రానికిగానూ 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు అందుకున్న బన్నీ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌తో కలిసి పనిచేయాలనే తన ఆసక్తిని బయటపెట్టారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న సందర్భంగా మృణాల్ పంపిన అభినందనలకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ పరిణామంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అనే చర్చ మొదలైంది.

ఇటీవల జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ ఆయనకు ప్రత్యేకంగా పూల బొకేతో పాటు ఓ అభినందన సందేశాన్ని పంపారు. "ప్రతి ప్రదర్శనలో మీరు చూపించే అంకితభావం, తీవ్రత, అద్భుతమైన ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ పురస్కారం మీకు అన్ని విధాలా అర్హమైనది" అని మృణాల్ తన సందేశంలో పేర్కొన్నారు.

మృణాల్ పంపిన బొకే, నోట్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన బన్నీ, భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. "థ్యాంక్యూ సో మచ్ మృణాల్ ఠాకూర్. మీ అభినందన చాలా మధురంగా ఉంది. ఎప్పటికైనా మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను" అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించకపోవడంతో బన్నీ పోస్ట్ వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' ఫ్రాంచైజీలోని మూడో భాగంతో పాటు లోకేశ్ కనగరాజ్, అట్లీ దర్శకత్వంలో సినిమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మృణాల్ ఠాకూర్, అడివి శేష్‌తో కలిసి నటించిన 'డకాయిట్' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
Allu Arjun
Pushpa 2
Mrunal Thakur
Tollywood
FilmFare Awards
Best Actor
Dacoit Movie
Lokesh Kanagaraj
Atlee
Adavi Sesh

More Telugu News