Samantha: నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌పై సమంత రియాక్షన్!

Samantha Reacts to Negative Comments and Trolls
  • ట్రోల్స్ తనను కుంగదీయలేవన్న సమంత
  • తన సోషల్ మీడియా పేజ్ కూడా శుభ్రంగా ఉండాలనుకుంటానని వ్యాఖ్య
  • ఒత్తిడి ఎదురైనప్పుడు ధ్యానం ద్వారా ప్రశాంతత పొందుతానన్న సామ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను వేగంగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సామ్, తాజాగా తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానాలిస్తూ, ముఖ్యంగా తనపై వచ్చే విమర్శలపై ఘాటుగా స్పందించారు.


సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌ను ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ, ప్రశంసలు తనను పొంగిపోయేలా చేయవని, అలాగే విమర్శలు తనను కుంగదీయలేవని స్పష్టం చేశారు. అయితే తన డిజిటల్ స్పేస్‌లోకి ఎవరైనా కావాలని నెగిటివిటీని తీసుకొస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. తన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, తన సోషల్ మీడియా పేజీని కూడా అలాగే ఉంచుకోవాలని భావిస్తానని ఆమె పేర్కొన్నారు. ఎవరినైనా బ్లాక్ చేశానంటే వారు తనను బాధపెట్టినట్లు కాదని, తన ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థమని అన్నారు.


ఇదే క్రమంలో సోషల్ మీడియా రీల్స్ వల్ల సమయం వృథా అవ్వడంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నప్పుడు చదువుకోవడానికి ఒక టైమ్ టేబుల్ ఉండేదని, కానీ ఇప్పుడు రీల్స్ వల్ల ఏకాగ్రతను కోల్పోతున్నామేమో అనే భయం వేస్తోందని ఆమె అంగీకరించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి తాను పుస్తకాలు చదవడం, పాడ్‌కాస్ట్‌లు వినడం వంటి నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఒత్తిడి ఎదురైనప్పుడు ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత పొందుతానని, ఏదైనా ఫన్నీ విషయం ఎదురైతే కిందపడి మరీ నవ్వుతానని తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.


ఇక సినిమాల విషయానికొస్తే, 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో పాటుగా రాజ్ & డీకే దర్శకత్వంలో 'రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్' అనే వెబ్ సిరీస్‌లో కూడా సామ్ నటిస్తోంది. మొత్తానికి వరుస ప్రాజెక్టులతో సమంత మళ్ళీ టాలీవుడ్‌లో తన హవాను కొనసాగించడానికి సిద్ధమవుతోంది.

Samantha
Samantha Ruth Prabhu
Ma Inti Bangaram
Nandini Reddy
Trolls
Social Media
Web Series
Raj and DK
Raktha Brahmaandam
Telugu Cinema

More Telugu News