Sunita Williams: అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. కల్పన చావ్లా ఘటనతో పోల్చిన నాసా!

Sunita Williams NASA compares mission to Kalpana Chawla tragedy
  • సునీతా విలియమ్స్ ప్రయాణించిన స్టార్‌లైనర్ మిషన్‌పై నాసా నివేదిక
  • 'టైప్-ఏ మిషాప్'గా వర్గీకరణ.. కల్పనా చావ్లా ప్రమాదంతో పోలిక
  • సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని వెల్లడి
  • 286 రోజులు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా తిరిగొచ్చిన వ్యోమగాములు
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రలో తలెత్తిన తీవ్ర సమస్యలపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) కీలక నివేదికను విడుదల చేసింది. ఈ మిషన్‌ను అత్యంత ప్రమాదకరమైన 'టైప్-ఏ మిషాప్'గా వర్గీకరించింది. గతంలో 2003లో కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయిన కొలంబియా షటిల్ ప్రమాదాన్ని కూడా నాసా ఇదే కేటగిరీలో చేర్చడం గమనార్హం.

2024 జూన్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు కేవలం 8 రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. అయితే, వారు ప్రయాణించిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో దాదాపు ఏడాది పాటు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. సుమారు 286 రోజుల తర్వాత, 2025 మార్చి 18న వారు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.

ఫిబ్రవరి 19న విడుదల చేసిన 311 పేజీల నివేదికలో నాసా ఈ వైఫల్యానికి గల కారణాలను వివరించింది. ప్రయోగం జరిగిన వెంటనే నౌక ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్యలు, ఐదు థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీకేజీలు వంటి తీవ్రమైన సాంకేతిక లోపాలను గుర్తించింది. అంతేకాకుండా, భద్రతా హెచ్చరికలను పెడచెవిన పెట్టి, మిషన్‌ను గడువులోగా పూర్తి చేయాలనే ఒత్తిడితో అధికారులు ముందుకు సాగడం పెను తప్పిదమని నివేదిక స్పష్టం చేసింది.

ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, 200 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లడంతో నాసా దీనిని తీవ్రంగా పరిగణించింది. కల్పనా చావ్లా ప్రమాదం సమయంలో ఇంజనీర్ల సూచనలను మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడం వల్లే విపత్తు జరిగిందని, మళ్లీ ఇక్కడ అదే 'కల్చరల్ బ్రేక్‌డౌన్' పునరావృతమైందని విచారణ కమిటీ తేల్చింది. చివరకు స్పేస్‌ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములు భూమికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ పర్యటనతో సునీతా విలియమ్స్ తన కెరీర్‌లో మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపి కొత్త రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఈ మిషన్ వైఫల్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది.
Sunita Williams
Sunita Williams space mission
NASA
Kalpana Chawla
Starliner
International Space Station
ISS
space exploration
Boeing
cultural breakdown

More Telugu News