Mumbai Coastal Road: మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు.. ఏ పాట వినిపిస్తుందంటే?

Mumbai Coastal Road Indias First Musical Road Plays Jay Ho
  • ముంబై కోస్టల్ రోడ్డులోని నారిమన్ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే దారిలో సంగీత స్ట్రిప్‌లు
  • ప్రారంభించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
  • వాహనదారులకు అలరించనున్న స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని 'జయహో' పాట
ముంబై కోస్టల్ రోడ్ (ఎంసీఆర్పీ) లోని కొంత భాగం దేశీయ మొట్టమొదటి సంగీత రహదారిగా (మ్యూజికల్ రోడ్డు) మారింది. హంగేరియన్ టెక్నాలజీ సహకారంతో కోస్టల్ రోడ్డులోని నారిమన్ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే క్యారేజ్‌వేపై 700 మీటర్ల మేర పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలోని 'జయహో' పాటను వినిపించనుంది.

ఈ పాటను దేశానికి అంకితం చేయడానికి, ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి ఈ విధంగా డిజైన్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మ్యూజికల్ రోడ్డు ఈ మార్గం గుండా వాహనదారులను అలరిస్తుందని అన్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.6.21 కోట్ల వ్యయం అయినట్లు అధికారులు తెలిపారు.

ముంబై కోస్టల్ రోడ్డు కారిడార్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ రహదారి దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డుగా నిలుస్తుందని అన్నారు. ఇటువంటి మ్యూజికల్ రహదారులు హంగేరీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్‌లో మాత్రమే ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిని ఈరోజు ప్రారంభించారు.
Mumbai Coastal Road
Musical Road
Maharashtra
Jay Ho Song
Slumdog Millionaire
Devendra Fadnavis

More Telugu News