Brandon Gill: డల్లాస్ పాకిస్థాన్‌లా ఉంది.. అమెరికా ఎంపీ వ్యాఖ్యలపై దుమారం

Brandon Gill Remarks Spark Controversy Over Dallas Pakistan Comments
  • డల్లాస్‌ పాకిస్థాన్‌లా మారుతోందన్న అమెరికా ఎంపీ బ్రాండన్ గిల్
  • భారీ ఇస్లామిక్ వలసలతో అమెరికా నాశనమవుతోందని వ్యాఖ్య
  • విపరీతంగా మసీదులు కడుతున్నారంటూ తన నియోజకవర్గ ప్రజల ఆందోళన
  • ఎంపీ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం, పాక్ కమ్యూనిటీతో ఫొటోలు వైరల్
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాలు 'భారీ ఇస్లామిక్ వలసల' కారణంగా 'ఇస్లామీకరణ' చెందుతున్నాయని, అక్కడి మాల్స్‌కు వెళ్తే పాకిస్థాన్‌లో ఉన్న అనుభూతి కలుగుతోందని ఆయన ఆరోపించారు.

ఫిబ్రవరి 7న 'రియల్ అమెరికాస్ వాయిస్' అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ ప్రజలు డల్లాస్ ప్రాంతంలో పెరుగుతున్న ఇస్లామీకరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. "తరతరాలుగా తమ కుటుంబాలకు చెందిన భూముల సమీపంలో కొత్తగా మసీదులు వెలుస్తున్నాయని, కొన్ని వర్గాల ప్రజలతో మొత్తం కమ్యూనిటీలే మారిపోతున్నాయని వారు చెబుతున్నారు" అని గిల్ వివరించారు.

ఇంటర్వ్యూతో ఆగకుండా, "భారీ ఇస్లామిక్ వలసలు మనం ప్రేమించే అమెరికాను నాశనం చేస్తున్నాయి" అని సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ సంతతికి చెందిన డాక్టర్ హషమ్ సర్వార్.. గిల్ తన ప్రచార నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా గిల్ పాకిస్థానీ కమ్యూనిటీ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుని ఆయన ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపారు.

బ్రాండన్ గిల్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ఓ మేయర్ అభ్యర్థి చేతులతో భోజనం చేయడంపై స్పందిస్తూ "నాగరిక సమాజంలో ఇలా తినరు, పశ్చిమ దేశాల పద్ధతులు పాటించకపోతే మీ మూడో ప్రపంచ దేశాలకు తిరిగి వెళ్ళండి" అని విమర్శించారు. ఈ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలసలు, సాంస్కృతిక మార్పులపై జరుగుతున్న చర్చను మరింత తీవ్రతరం చేశాయి.
Brandon Gill
Texas
Dallas
Pakistan
Islamization
Islamic Immigration
Muslim Community
US Politics
Republican Party
Hassam Sarwar

More Telugu News