LPL Financial: హైదరాబాదులో భారీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

LPL Financial Launches Global Capability Center in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
అమెరికాకు చెందిన దిగ్గజ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అదే సమయంలో కొత్త కార్యకలాపాలకు హెడ్‌గా రమేశ్ కాజాను నియమించినట్లు వెల్లడించింది. ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 

ఈ సంస్థ ప్రస్తుతం 32 వేల మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థలకు వెల్త్ మేనేజ్‌మెంట్ సేవల సపోర్ట్ అందిస్తోంది. అంతేకాకుండా, దాదాపు 80 లక్షల మంది క్లయింట్లకు సంబంధించిన 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది. అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ టూల్స్, వినూత్న అప్లికేషన్ల ప్లాట్‌ఫాం ద్వారా.. ఫైనాన్షియల్ అడ్వైజర్లు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలు అందించేందుకు ఉపయోగపడే ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రోడక్టులను ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది. 

టెక్నాలజీ, ఆపరేషన్స్ విస్తరణలో భాగంగా ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ ఈ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆర్థిక సేవల రంగంలో ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, అలాగే వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుకూల వాతావరణం ఉండటంతో హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో హైదరాబాద్ కేంద్రం ద్వారా టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో వందల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ వెల్లడించింది. 

ప్రస్తుతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లో నియామక ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ తెలిపింది. ఇందులో నెట్‌వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్‌ఫార్మ్స్, మిడిల్‌వేర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి కీలక విభాగాల్లో నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. ఉద్యోగావకాశాల కోసం ఆసక్తి ఉన్నవారు ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ ఇన్ పేజీ లేదా సంస్థ అధికారిక  కెరియర్స్ సైట్‌ను సందర్శించాలని సూచించింది.
 
 

Go Back to Shorts
LPL Financial
Wealth Management
Hyderabad
Global Capability Center
Ramesh Kaja
Financial Services
Technology
Investment Solutions
Financial Advisors
Careers

More Telugu News