Deepak Kumar: కోట్‌ద్వార్‌లో 'బాబా' పేరు రగడ.. ముస్లిం వ్యక్తికి అండగా నిలిచిన హిందూ యువకుడు!

Deepak Kumar stands against religious tension in Kotdwar
  • షాపు పేరు 'బాబా' అని ఉండటంపై వివాదం
  • ముస్లిం వృద్ధుడికి అండగా హిందూ యువకుడు
  • 'మొహమ్మద్ దీపక్'గా వైరలైన దీపక్ కుమార్
ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్ అనే చిన్న పట్టణం గత కొన్ని రోజులుగా మతపరమైన ఉద్రిక్తతలకు వేదికైంది. కేవలం ఒక బట్టల షాపు పేరు చుట్టూ మొదలైన వివాదం, చివరకు రోడ్డుపై నిరసనలు, కేసుల వరకు వెళ్లింది.

మొహమ్మద్ షోయబ్ అనే వ్యక్తికి కోట్‌ద్వార్‌లో 'బాబా' అనే పేరుతో ఒక బట్టల షాపు ఉంది. అయితే, స్థానిక బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సమీపంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయమైన 'సిద్ధబాలి బాబా' పేరును స్ఫురించేలా ఈ పేరు ఉందని, ఒక ముస్లిం వ్యక్తి ఈ పేరు వాడటం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు గొడవకు దిగారు. షాపు పేరు మార్చాలని ఒత్తిడి తెచ్చారు.

ఈ వివాదం ముదురుతున్న సమయంలో జనవరి 26న కొంతమంది షాపు వద్దకు వచ్చి వృద్ధుడైన షోయబ్‌ను వేధిస్తుండగా, స్థానిక జిమ్ యజమాని దీపక్ కుమార్ (37) అడ్డుకున్నాడు. ఆ గుంపు దీపక్ పేరు అడగ్గా, ఆయన "నా పేరు మొహమ్మద్ దీపక్" అని సమాధానం ఇచ్చాడు. "నేను హిందువునే, కానీ అంతకంటే ముందు భారతీయుడిని. 30 ఏళ్లుగా ఉన్న పేరును ఇప్పుడు మార్చమంటే ఎలా?" అంటూ ఆయన నిలదీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆయనను ఒక వర్గం 'హీరో'గా వర్ణిస్తే, మరో వర్గం వ్యతిరేకించింది.

ఈ ఘటన నేపథ్యంలో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారుల మీద, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారి మీద, దీపక్ కుమార్ మీద కూడా (బెదిరింపుల ఆరోపణలతో) కేసులు నమోదయ్యాయి. రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులు దీపక్‌కు మద్దతు తెలపగా, బీజేపీ-కాంగ్రెస్ మధ్య రాజకీయ మాటల యుద్ధం మొదలైంది. పోలీసులు రెండు వైపులా చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. షాపు పేరును 'బాబా'గానే కొనసాగించాలని, ఎవరూ నిరసనలు చేయకూడదని నిర్ణయించారు. 

కోట్‌ద్వార్‌లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. నిన్న దీపక్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పోలీసులు ఆయన జిమ్, ఇంటి వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు పట్టణంలోకి వచ్చి ఉద్రిక్తతలు సృష్టించకుండా సరిహద్దుల వద్ద తనిఖీలు చేస్తున్నారు.

More Telugu News

Deepak Kumar
Kotdwar
Uttarakhand
Baba clothing shop
Bajrang Dal
Religious tension
Mohammad Shoyab
Hanuman temple
India