Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!

Chandrababu Government Serious on Ghee Adulteration in Tirumala
  • శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సుదీర్ఘ సమీక్ష
  • సీబీఐ నివేదికలోని అంశాలపై మూడున్నర గంటల చర్చ
  • గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయన్న మంత్రులు
  • దోషులపై చర్యలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
  • తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేసిన ప్రభుత్వం
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ తీవ్రంగా స్పందించింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇతర అజెండా అంశాలను పక్కనపెట్టి, కేవలం ఈ అంశంపైనే సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని కేబినెట్ అభిప్రాయపడింది. సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో కేబినెట్ చర్చల వివరాలను వెల్లడించారు.

ఈ అంశంపై రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని, కేవలం భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, శ్రీవారి క్షేత్ర పవిత్రతను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరూ ఈ అంశంపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారని తెలిపారు.

కొలుసు పార్థసారథి ఏమన్నారంటే..
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, "కోట్లాది మంది హిందువులు ఆరాధించే ఏడుకొండలవాని సన్నిధిలో జరిగిన ఈ మహాపాపం గురించి సీబీఐ ఇచ్చిన నివేదికపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. హిందువుల మనోభావాలను, తిరుమల పవిత్రతను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మంత్రులందరూ అభిప్రాయాలు తెలిపారు. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, కోర్టు ఇంకా కాగ్నిజెన్స్ లోకి తీసుకోలేదు. అయితే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తప్పిదాలను సరిదిద్దేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది," అని అన్నారు.

పయ్యావుల కేశవ్ వివరణ..
ఈ వ్యవహారంలోని సాంకేతిక, చట్టపరమైన అంశాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. "సీబీఐ నుంచి ప్రభుత్వానికి 11 పేజీల నివేదిక అందింది. ఇందులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్దేశపూర్వక తప్పిదాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్‌డీబీ-సీఏఎల్‌ఎఫ్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం నెయ్యిలో సోయాబీన్, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో (జంతు కొవ్వు), లార్డ్ వంటివి ఉండే అవకాశం ఉందని (సస్పెక్టెడ్ అడల్టరెంట్స్) తేలింది. ఈ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు ఆరోపణలు చేశారు" అని కేశవ్ తెలిపారు.

"2022లోనే సీఎఫ్‌టీఆర్‌ఐ రిపోర్టులో కల్తీ జరిగిందని తేలినా, నాటి టీటీడీ అధికారులు, పాలకమండలి చైర్మన్ దానిని తొక్కిపెట్టారు. గతంలో చంద్రబాబు హయాంలో నెయ్యి కొనుగోలుకు కఠిన నిబంధనలు పెట్టారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం ఐదు నెలల్లోనే ఆ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించారు. పాలు సేకరించే సామర్థ్యం లేని సంస్థలకు, టర్నోవర్ తగ్గించి, అనుభవం లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు. బోలే బాబా వంటి సంస్థలకు టెండర్ దక్కించుకోవడానికి వైవీ సుబ్బారెడ్డి పీఏ ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్లలో పాల్గొన్నా అధికారులు అడ్డుకోలేదు. ఈ తప్పులన్నింటికీ నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈవో ధర్మారెడ్డి, సీఏవో బాలాజీ బాధ్యులని సీబీఐ నివేదికలో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది," అని పయ్యావుల కేశవ్ వివరించారు.

నాదెండ్ల మనోహర్ స్పందన..
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ అంశంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. "కేబినెట్ సమావేశానికి అడ్వకేట్ జనరల్‌ను కూడా ఆహ్వానించి న్యాయపరమైన సలహాలు తీసుకున్నాం. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2022లో కల్తీ రిపోర్ట్ వచ్చాక, గత ప్రభుత్వం ఒక్కసారి కూడా నెయ్యి శాంపిల్స్‌ను టెస్టుకు పంపలేదు. ఎందుకంటే అందులో అసలు నెయ్యే లేదు. కానీ, మా కూటమి ప్రభుత్వం వచ్చాక 12 నుంచి 15 సార్లు నాణ్యతా పరీక్షలు చేయించాం. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం" అని స్పష్టం చేశారు.

సత్యకుమార్ యాదవ్ ఆరోపణలు..
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, వైసీపీ నాయకత్వం హిందూ ధర్మం మూలాలనే దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. "కల్తీ జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. అంటే, శ్రీవారి ప్రసాదంలో కల్తీని సమర్థిస్తున్నారా? అసలు పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేస్తారు? రూ.250 కోట్ల అవినీతి కోసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు. గతంలో తిరుమలలో ఏడు కొండలకు బదులు రెండే ఉన్నారని వాదించడం, అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం, డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనాలు చేయడం వంటి చర్యలతో ఆలయ పవిత్రతను మంటగలిపారు. ఈ బోలే బాబా డైరీని దొడ్డిదారిన తెచ్చిన అలీబాబా ఎవరో, దాని వెనకున్న 40 దొంగలు ఎవరో ప్రజలకు తెలియాలి," అని సత్యకుమార్ యాదవ్ ఘాటుగా విమర్శించారు.



More Telugu News

Chandrababu Naidu
Tirumala
TTD
Ghee Adulteration
Andhra Pradesh Cabinet
Laddoo Prasadam
YV Subba Reddy
Anil Kumar Singhal
Dharma Reddy
Kolusu Parthasarathi