ఈ నెల 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె... ప్రధాన డిమాండ్ ఇదే!
- జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
- వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్
- ప్రభుత్వ ఆమోదంలో జాప్యమే సమ్మెకు కారణం
- 9 సంఘాల ఐక్యవేదిక యూఎఫ్ బీఏ సమ్మెకు పిలుపు
తొమ్మిది బ్యాంకు సంఘాల ఉమ్మడి వేదిక అయిన యూఎఫ్ బీయూ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్-1947 ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), చీఫ్ లేబర్ కమిషనర్, ఆర్థిక సేవల విభాగానికి (డీఎఫ్ఎస్) సమ్మె నోటీసు పంపింది. బ్యాంకులకు అన్ని శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించి, 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని యూనియన్లు స్పష్టం చేశాయి.
ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఆమోదం తెలిపి ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని యూనియన్లు గుర్తుచేశాయి. 2023 డిసెంబర్ 7న ఐబీఏ, యూఎఫ్ బీయూ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఈ సిఫార్సు జరిగింది.
అయితే, ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి తుది ఆమోదం లభించడంలో తొమ్మిది నెలలకు పైగా జాప్యం జరుగుతోందని, ఈ కారణంగానే తాము మళ్లీ ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని యూఎఫ్ బీయూ తెలిపింది. పనిదినాలు తగ్గినా, మొత్తం పనిగంటలు తగ్గకుండా ఉండేందుకు రోజువారీ పనివేళలను 40 నిమిషాలు పెంచేందుకు కూడా యూనియన్లు అంగీకరించడం గమనార్హం.