Zohran Mamdani: న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ.. ఖురాన్‌పై ప్రమాణం చేస్తూ సరికొత్త చరిత్ర!

Zohran Mamdani Makes History as New York Mayor Sworn in on Quran
  • న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా మేయర్
  • వందేళ్ల నాటి చారిత్రక మెట్రో స్టేషన్‌లో అర్ధరాత్రి వేళ ప్రమాణ స్వీకారం
  • కార్మికుల పట్ల నిబద్ధతను చాటేందుకే ‘సబ్‌వే’ స్టేషన్ వేదికగా ఎంపిక
  • ప్రమాణ స్వీకారానికి మూడు పవిత్ర ఖురాన్ ప్రతుల వినియోగం
అమెరికాలోనే అతిపెద్ద నగరమైన న్యూయార్క్ పాలనా పగ్గాలను ముప్పై నాలుగేళ్ల యువ డెమొక్రాట్ జోహ్రాన్ మమ్దానీ చేపట్టారు. నూతన సంవత్సరం 2026 ప్రారంభమైన తొలి నిమిషాల్లోనే ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర చరిత్రలో ఒక మేయర్ పవిత్ర ఖురాన్‌పై ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. మమ్దానీ కేవలం మొదటి ముస్లిం మేయర్ మాత్రమే కాదు, ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా వాసి, ఆఫ్రికా సంతతి వ్యక్తిగా కూడా రికార్డు పుటల్లోకి ఎక్కారు.

మమ్దానీ తన మొదటి ప్రమాణ స్వీకార వేడుకను అత్యంత విభిన్నంగా నిర్వహించారు. మన్హటన్ భూగర్భంలో 1945 నుంచి మూసివేసి ఉన్న చారిత్రక 'ఓల్డ్ సిటీ హాల్ సబ్‌వే స్టేషన్'ను ఈ వేడుకకు వేదికగా ఎంచుకున్నారు. "ఈ నగరాన్ని నడిపించే శ్రామిక వర్గం పట్ల నాకున్న గౌరవానికి ఇది సంకేతం" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో, తన కుటుంబ సభ్యుల మధ్య ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ చారిత్రక ఘట్టం కోసం మమ్దానీ మూడు పవిత్ర ఖురాన్ ప్రతులను ఉపయోగించారు. అందులో ఒకటి తన తాతగారికి చెందిన ఖురాన్ ప్రతి కాగా, రెండోది 18వ శతాబ్దానికి చెందిన, నల్లజాతీయుల చరిత్రను ప్రతిబింబించే అర్టురో షోంబర్గ్ సేకరించిన అత్యంత అరుదైన ఖురాన్ ప్రతి. మూడోది తన నానమ్మ ఖురాన్ ప్రతిని కూడా ఆయన ఉపయోగించారు. 

అర్ధరాత్రి జరిగిన ప్రైవేట్ వేడుక తర్వాత, నేటి (జనవరి 1) మధ్యాహ్నం 1 గంటకు సిటీ హాల్ మెట్లపై బహిరంగ ప్రమాణ స్వీకార వేడుక జరగనుంది. మమ్దానీకి రాజకీయ గురువు వంటి సెనేటర్ బెర్నీ సాండర్స్ ఈ వేడుకలో ఆయనతో ప్రమాణం చేయిస్తారు. మరో యువ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ ప్రారంభ ప్రసంగం చేస్తారు. ఈ సందర్భంగా బ్రాడ్‌వే వీధుల్లో వేలాది మందితో భారీ 'బ్లాక్ పార్టీ'ని కూడా నిర్వహించనున్నారు.  
Zohran Mamdani
New York Mayor
Muslim Mayor
South Asian
Africa descent
Quran oath
Bernie Sanders
Alexandria Ocasio-Cortez
Old City Hall Subway Station
New York City

More Telugu News