కంటెంట్ అంటే ఇది అనిపిస్తున్న ఓటీటీ సినిమా!
- ఓటీటీకి వచ్చిన 'అవిహితం'
- విలేజ్ నేపథ్యంలో సాగే కథ
- ఆకట్టుకునే సహజత్వం
- ఆలోచింపజేసే కథా బలం
ఒకప్పుడు ఏడాదిపాటు కథపై కసరత్తు చేసి, మూడు నెలల్లో సినిమా తీసేవారు. కానీ ఇప్పుడు కాంబినేషన్ సెట్ కాగానే కథ అనుకోవడానికి కొన్ని వారాలే పడుతోంది. షూటింగుకి మాత్రం ఏళ్లకి ఏళ్లు పడుతుంది. తీరా థియేటర్ కి వచ్చిన తరువాత, అది మూడు రోజులకి మించి నిలబడలేకపోతోంది. ప్రేక్షకుల వెంట వెళ్లలేకపోతోంది .. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతోంది. అందుకు కారణం కథలో విషయం లేకపోవడం .. కథ అనేది కచ్చితంగా ఆకాశంలో నుంచి ఊడిపడాలని అనుకోవడమే.
కానీ కొన్ని సినిమాలు మాత్రం కథనే ముఖ్యం అనే విషయాన్ని అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉంటాయి. స్టార్స్ తో .. భారీ ఖర్చుతో పనిలేకుండా ఈ సినిమాలు అలరిస్తాయి .. ఆకట్టుకుంటాయి. అలాంటి జాబితాలో 'అవిహితం' అనే ఒక చిన్న సినిమా కనిపిస్తుంది. రీసెంటుగా ఈ మలయాళ సినిమా 'జియో హాట్ స్టార్' లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఎదుటివాళ్లు అల్లరిపాలవుతూ ఉంటే చూసి మానసిక ఆనందాన్ని పొందే కొన్ని పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. తమ కాలక్షేపం కోసం ఇతరుల పరువు ప్రతిష్ఠలతో ఆడుకునే కొన్ని స్వభావాల కథ ఇది. అలాంటి ఈ కథ ఇప్పుడు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కథ అనేది ఆకాశంలో నుంచి కాదు, జనంలో నుంచి పుట్టాలి అనే విషయాన్ని నిరూపించే ఈ కంటెంట్, ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.