Dinesh Sanjay Patole: అత్యాచార యత్నాన్ని అడ్డుకున్న యువతి.. రాయితో కొట్టి చంపిన కామాంధుడు

Dinesh Sanjay Patole arrested for attempted rape and murder in Pune
  • పుణెలో యువతిపై అత్యాచార యత్నం, హత్య
  • 250 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కేసును ఛేదించిన పోలీసులు
  • నిందితుడు దినేశ్ పటోలే అరెస్ట్ 
  • లైంగిక కోరిక తీర్చకపోవడంతోనే హత్య చేసినట్టు వెల్లడి
పుణెలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి యత్నించి, ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హవేలీ తాలుకాలోని ఉరులి కాంచన్‌కు చెందిన దినేశ్ సంజయ్ పటోలే (26) ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. హవేలీ తాలుకాలోని కోరెగావ్ ముల్ గ్రామానికి చెందిన బాధితురాలు ఈ నెల 14న రాత్రి 7:30 గంటల సమయంలో రోడ్డు పక్కన శవమై కనిపించింది. ఆమె తలపై గాయం ఉండటంతో హత్యగా నిర్ధారించారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు ఉరులి కాంచన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

లోకల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఇన్స్‌పెక్టర్ అవినాశ్ శిలింకర్‌, ఉరులి కాంచన్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ సచిన్ వాంగ్డే నేతృత్వంలోని బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిందితుడిని గుర్తించేందుకు నేరం జరిగిన ప్రదేశానికి దారితీసే మార్గాల్లోని సుమారు 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక విశ్లేషణ, సమాచార వర్గాల నుంచి అందిన వివరాలతో నిందితుడు పటోలే అని నిర్ధారించుకున్నారు.

పక్కా ప్రణాళికతో పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కొల్హాపూర్ రేంజ్ స్పెషల్ ఐజీపీ సునీల్ ఫులారీ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘కోరెగావ్ ముల్ గ్రామంలో బాధితురాలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించిన నిందితుడు ఆమెను అనుసరించాడు. లైంగిక వాంఛ తీర్చాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో, పక్కనే ఉన్న రాయితో తలపై మోది అక్కడికక్కడే చంపేశాడు’’ అని ఐజీపీ వివరించారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అక్టోబర్ 27 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు.
Dinesh Sanjay Patole
Pune crime
attempted rape
murder
Uruli Kanchan
Koregaon Mul
sexual assault
crime news
Maharashtra police

More Telugu News