Elvish Yadav: బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై దుండగుల ఫైరింగ్... 30 రౌండ్ల కాల్పులు

Bigg Boss Winner Elvish Yadav House Firing
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న ఆయన ఇంటిపై ఈ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దాదాపు 25 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు.

కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ (27) పని నిమిత్తం హర్యానా బయట ఉన్నట్లు తెలిసింది. అయితే, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్‌టేకర్‌ మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

సెక్టార్-56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Go Back to Shorts
Elvish Yadav
Elvish Yadav firing
Bigg Boss OTT 2
Gurugram firing incident
Haryana crime news
YouTuber Elvish Yadav
firing at residence
police investigation
sector 56 police station
cctv footage

More Telugu News