Mahanadu: మహానాడులో కమ్మని విందు.. ఈసారి నోరూరించనున్న మాంసాహార వంటకాలు!

TDP Mahanadu Grand Feast Includes Non Veg Dishes After Long Time
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ మహానాడు ఎక్కడ జరిగినా, అక్కడ పసందైన విందు భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్.టి.రామారావు స్వయంగా భోజనప్రియుడు కావడంతో ఆయన అభిరుచులకు అనుగుణంగానే మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు, అతిథులకు విందు ఏర్పాటు చేయడం ఆనవాయతీగా వస్తోంది. ప్రస్తుతం కడప వేదికగా జరుగుతున్న మూడు రోజుల మహానాడులో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. విశేషమేమిటంటే, చాలా కాలం తర్వాత ఈసారి మహానాడులో మాంసాహార వంటకాలను కూడా వడ్డిస్తున్నారు.

రోజుకు 30 రకాల వంటకాలు
మహానాడు నిర్వహించే ప్రాంతంతో సంబంధం లేకుండా భోజన ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈసారి కడపలో జరుగుతున్న వేడుకలోనూ ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డు వంటి ప్రసిద్ధ సంప్రదాయ పిండివంటలతో పాటు పప్పు, దప్పళం, ఉలవచారు, పాల తాలికలు, చక్కెర పొంగలి వంటి తెలుగువారి ఇష్టమైన వంటకాలను అందిస్తున్నారు. వీటితో పాటు ఆపిల్ హల్వా, వెజ్ జైపూరి, కడాయి వెజిటబుల్ కుర్మా వంటి ఆధునిక రుచులను కూడా మెనూలో చేర్చారు. ఇలా ప్రతిరోజూ దాదాపు 30 రకాల వంటకాలతో అతిథులకు విందు ఏర్పాటు చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న ప్రతినిధుల కోసం భోజన ఏర్పాట్లను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ వంటకాలను, మిఠాయిలను ప్రత్యేకంగా వడ్డించనున్నారు. ఈ భారీ విందును సిద్ధం చేయడానికి ఏకంగా 2000 మంది పాకశాస్త్ర నిపుణులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు అత్యంత ఇష్టమైన పాలతాలికలు, బాదం బర్ఫీ, బొబ్బట్లు, చక్కెర పొంగలి వంటి ప్రత్యేక వంటకాలను వండనున్నారు.

మాంసాహార ప్రియులకు కూడా..
ఈ సందర్భంగా భోజన ఏర్పాట్ల కమిటీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "2014 నుంచి మహానాడుకు మనమే భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సంవత్సరం కడప మహానాడుకు 10 రోజుల ముందే 2000 మంది వర్కర్లతో వచ్చి, కమిటీ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్లు, భోజనాలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ రెండు రోజుల్లో తాపేశ్వరం కాజాలు, అల్లూరయ్య మైసూరుపాకులు, చక్కెర పొంగలి, హల్వా వంటి స్వీట్లతో పాటు రాయలసీమ వాసుల కోసం నాన్ వెజిటేరియన్ విభాగంలో గోంగూర చికెన్ బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలు, రోజూ ఎగ్ ఫ్రై వంటివి అందిస్తున్నాం. వెజిటేరియన్ వంటకాలను కూడా రుచిగా అందిస్తూ ఈ మూడు రోజుల మహానాడును విజయవంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం" అని తెలిపారు.

భారీ ఏర్పాట్లు.. ప్రత్యేక షెడ్లు
భోజనాల కోసం ప్రత్యేకంగా ఐదు భారీ హ్యాంగర్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు హ్యాంగర్లను పూర్తిగా నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించారు. ఒక్కో షెడ్‌లో ఒకేసారి 3500 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. మరో హ్యాంగర్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలకు, ఇంకో హ్యాంగర్‌లో కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి భోజన సదుపాయం కల్పించారు. ప్రతిరోజూ సుమారు 30,000 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేయగా, అవసరమైతే అప్పటికప్పుడు మరో 10,000 మందికి వడ్డించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.

మహానాడు చివరి రోజు జరిగే భారీ బహిరంగ సభ సందర్భంగా దాదాపు 3 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం కడప-చిత్తూరు మార్గంలో 75,000 మందికి, పులివెందుల మార్గంలో 35,000 మందికి, రాజంపేట నుంచి వచ్చే మార్గంలో 30,000 మందికి, నంద్యాల మార్గంలో 50,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు.
Go Back to Shorts
Mahanadu
Telugu Desam Party
TDP Mahanadu
Kadapa
Andhra Pradesh
NT Rama Rao
Food Menu
Gongura Chicken
Rayalaseema
Telugu Cuisine

More Telugu News