ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
- ఉండవల్లి నివాసంలో బూత్ లెవల్ అధికారికి తన వివరాల సమర్పణ
- ప్రతి పౌరుడూ ఓటు వివరాలు సరిచూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
- ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన "ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026" కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రజలందరూ సహకరించాలని, తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా లోకేశ్ స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారులు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించడంతో పాటు, అర్హులైన నూతన ఓటర్ల నమోదును చేపడుతున్నారు. అభ్యంతరాలు పరిశీలన అనంతరం జులై 21న ముసాయిదా జాబితాను, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.