ఎల్కతుర్తికి చేరుకున్న కేసీఆర్... ఎటు చూసినా గులాబీమయం
- నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ
- గులాబీమయం అయిన ఎల్కతుర్తి
- ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్ లో విచ్చేసిన కేసీఆర్
హెలికాప్టర్‌లో ఉండగానే కేసీఆర్ కిందకు చూస్తూ సభకు హాజరైన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం తెలిపారు. ఆయన్ను చూసేందుకు సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. 'జై కేసీఆర్', 'జై తెలంగాణ' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ మద్దతును తెలియజేశారు. గులాబీ జెండాలు రెపరెపలాడిస్తూ తమ నాయకుడికి స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. వేదికకు కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తమ ఆటపాటలతో సభకు వచ్చిన వారిలో ఉత్సాహం నింపారు. తెలంగాణ పాటలకు అనుగుణంగా పలువురు కార్యకర్తలు, ప్రజలు నృత్యాలు చేస్తూ కనిపించారు. మొత్తం మీద సభా ప్రాంగణం సందడిగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది.
