Veerayya Chowdary: వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు... హంతకులకు మాస్ వార్నింగ్

Chandrababu Naidu Pays Tribute to Veerayya Chowdary Warns Killers
షార్ట్స్‌లో చూడండి
ఒంగోలులో నిన్న రాత్రి హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చేరుకున్న సీఎం, వీరయ్య చౌదరి పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం, వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.

అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు శాసనసభ్యులు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వారు కూడా వీరయ్య చౌదరి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చారని వెల్లడించారు. కరడుగట్టిన నేరస్తుల కంటే దారుణంగా హత్య చేశారని, 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే ఎలా చంపారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వారు భూమ్మీద ఉండేందుకు అనర్హులు... వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఇంత ఘోరానికి పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, తద్వారా వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తామని చెప్పారు. 

వీరయ్య చౌదరి ఎంతో సమర్థుడైన నాయకుడని, పార్టీకి ఎన్నో సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. లోకేశ్ తో పాటు పాదయాత్రలో 100 రోజుల పాటు తిరిగాడని గుర్తు చేసుకున్నారు. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి... పిలిస్తే పలికే నేత వీరయ్య... ఇలాంటి వ్యక్తిని చంపేశారని, నిందితులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని పునరుద్ఘాటించారు. నిందితులు ఎంత తెలివైనవాళ్లు అయినా ఎక్కడో ఒక చోట క్లూస్ వదిలిపెడతారని, వారు ఎక్కడున్నా గాలించి పట్టుకుంటామని అన్నారు. హంతకుల కోసం 12 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. 

ఈ మండలంలో టీడీపీకి 10 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందంటే వీరయ్య చౌదరి సత్తా ఏంటో అర్థమవుతుందని అన్నారు. ఇటువంటి మంచి నాయకుడ్ని కోల్పోవడం బాధ కలుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉండి కూడా ఇలాంటి ఘోరాలు జరుగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు ఒకటే హెచ్చరిక... మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.

కార్యకర్తలు భయపడ్దొదని, ఓ కుటుంబ పెద్దగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నేర రాజకీయాలు చేసే పరిస్థితి కనిపిస్తోందని, అలాంటి వారిని అందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Veerayya Chowdary
Chandrababu Naidu
TDP leader murder
Ongole
Prakasam district
Andhra Pradesh Politics
Political Murder
Crime Investigation
Telugu Desam Party
Mass Warning

More Telugu News