ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
- ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి
- రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వివరణ
- చిన్నపిల్లలు, వృద్ధులపై లైంగిక దాడులు సిగ్గుపడాల్సిన విషయమన్న డీజీపీ
గంజాయి నివారణకు ఈగల్..
రాష్ట్రంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు మాత్రం ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని డీజీపీ చెప్పారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ సంస్థను ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా గంజాయి నిర్మూలన కోసం క్యాబినెట్ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిందని డీజీపీ గుర్తుచేశారు.
నేరాల కట్టడికి సీసీ కెమెరాలు..
టెక్నాలజీ సాయంతో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా ఏదో ఒక కెమెరాలో రికార్డయ్యేలా సీసీ కెమెరాలను అమర్చుతున్నామని చెప్పారు. మార్చి 1 నాటికి మొత్తం లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఆ దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దాతలు, ప్రజల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.