కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి!
- సీజ్ చేసిన గంజాయిని కాజేస్తూ బయట అమ్మకం
- కాజీపేట డివిజన్ లో కానిస్టేబుల్ నిర్వాకం
- అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఉన్నతాధికారులు
నర్సంపేటకు చెందిన కానిస్టేబుల్ ఈ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఓ రెయిడ్ లో పెద్ద మొత్తంలో పట్టుబడ్డ గంజాయిని అధికారులు ఇదే ఠాణాలో సీజ్ చేసి పెట్టారు. దీనిపై కన్నేసిన సదరు కానిస్టేబుల్.. దశల వారీగా గంజాయిని ఇంటికి తీసుకెళ్లాడు. తన స్నేహితులు, బంధువులకు ఇచ్చి అమ్మించాడు. ఈ క్రమంలో నర్సంపేట నుంచి వరంగల్ వచ్చే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టగా ఓ బైక్ పై వచ్చిన యువకులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించి పట్టుకున్న పోలీసులు వారిని సోదా చేయగా గంజాయి లభ్యమైంది. ఆ తర్వాత విచారణలో కానిస్టేబుల్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి సదరు కానిస్టేబుల్ ఇంట్లో సోదాలు నిర్వహించగా తస్కరించిన గంజాయి దొరికింది. ప్రస్తుతం కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.