పాలడబ్బా కోసం 'ముక్కుపుడక' అమ్ముకున్నాను: నటి సులక్షణ

Sulakshana Interview
  • 18 ఏళ్లకే తనకు పెళ్లి జరిగిందన్న సులక్షణ  
  • 23 ఏళ్ల వయసులో విడాకులయ్యాయని వ్యాఖ్య 
  • అత్తామామలు పట్టించుకోలేదన్న సులక్షణ


బాలనటిగా .. కథానాయికగా సులక్షణ చాలా సినిమాలలో నటించారు. తెలుగులో కంటే కూడా తమిళంలో ఆమె ఎక్కువ సినిమాలను చేశారు. ఇక మలయాళ .. కన్నడ సినిమాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కెమెరా ముందుకు ఆమె రాక చాలా కాలమైనా, ఆ తరం ప్రేక్షకులు ఆమెను మరిచిపోలేదు. అలాంటి ఆమె తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. 

" నేను 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను .. 23 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు .. విడాకులు కూడా అయిపోయాయి. ఎందుకు విడిపోయామనేది నేను పూర్తిగా చెప్పలేను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము .. కానీ పెళ్లి తరువాత ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలబడలేదు. పిల్లలు తనకి అవసరం లేదని ఆయన కోర్టులోనే చెప్పారు. ఇద్దరు పిల్లలతో .. కట్టుబట్టలతో బయటికి వచ్చాను. నాకు రెంట్ ఇల్లు కూడా దొరక్కుండా చేయాలని ఆయన చూశారు. అత్తమామలు పట్టించుకోకపోవడం వలన, ఒంటరి పోరాటం మొదలుపెట్టాను" అని చెప్పారు.  


"నా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక మంచి మనిషి ఇల్లు అద్దెకి ఇచ్చారు. పాలడబ్బాకి కూడా డబ్బులు లేవు. 6 నెలల వరకూ పాల డబ్బాలకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో నా 'ముక్కుపుడక' అమ్మేశాను. ఆ డబ్బుతో పాల డబ్బాలు తెచ్చిపెట్టుకున్నాను. నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. అందువల్లనే మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాను .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారాను. నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను మళ్లీ పెళ్లి గురించిన ఆలోచన చేయలేదు. నా కష్టాలు ఎవరికీ చెప్పుకోనూ లేదు" అని అన్నారు.     

Advertisement
Sulakshana
Actress
Tollywood

More Telugu News