వైద్యులపై దాడుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
- కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం
- భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న డాక్టర్లు
- ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారాన్ని హెచ్ఓడీలకు అప్పగించిన కేంద్రం
కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఘటన నేపథ్యంలో... తమ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్లు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ స్పందించారు.
రోగులు, వారి బంధువులు డాక్టర్లపైనా, ఇతర వైద్య సిబ్బందిపైనా భౌతిక దాడులు చేస్తుండడం, అసభ్యకరంగా తిట్టడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారాన్ని హెచ్ఓడీలకు అప్పగించిందని గోయల్ వివరించారు. ఈ మేరకు దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.