గవర్నర్ వ్యవస్థపై కీలక కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
- సుప్రీం కోర్టులో గవర్నర్ల అంశంపై కేసులు విచారకరమన్న జస్టిస్ నాగరత్న
- గవర్నర్ ను పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యతని హితవు
- పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని వ్యాఖ్య
గతంలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గవర్నర్ లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు విమర్శించింది. ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించినందుకు తమిళనాడు గవర్నర్ పై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య నెలకొన్న ఈ వివాదాలు ఓ పక్క చర్చనీయాంశంగా మారిన తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న గవర్నర్ ల వ్యవస్థపై మరోసారి కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఎన్ఎల్ఎస్ఐయూ – పీఏసీటీ సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న పలు కీలక అంశాలపై మాట్లాడారు.
గవర్నర్ల తటస్థత గురించి నాటి రాజ్యాంగ సభ చర్చలలో జి. దుర్గాబాయి చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న గుర్తు చేస్తూ.. గవర్నర్ లను పార్టీ రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యత అని అన్నారు. పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని అన్నారు. గవర్నర్ల అంశంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులు విచారకరమని పేర్కొన్నారు. జస్టిస్ నాగరత్న గతంలోనూ గవర్నర్ల తీరును ఆక్షేపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో నల్సార్ యూనివర్శిటీలో పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరో మారు జస్టిస్ నాగరత్న .. గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.