నేపాల్ లో నదిలో పడ్డ బస్సులు.. 60 మంది మిస్సింగ్.. వీడియో ఇదిగో!
- కొండచరియలు విరిగిపడడంతో బోల్తా పడ్డ బస్సులు
- ప్రమాదం నుంచి బయటపడ్డ ముగ్గురు
- రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ లు.. నదిలో గాలింపు చర్యలు
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. త్రిశూలి నదికి రెండువైపులా కొండలు ఉండగా.. ఓ కొండను ఆనుకుని నారాయణ్ ఘాట్ - మగ్లింగ్ రోడ్ ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున బస్సులు ఈ రోడ్ పై వెళుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు అదుపుతప్పి నదిలో పడ్డాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం గురించిన సమాచారం అందగానే పోలీసులు, సైన్యం స్పందించాయని, సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. బోట్లతో త్రిశూల్ నదిలో గాలిస్తున్నారని వివరించారు. అయితే, వరద ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టంగా మారిందని తెలిపారు. కాగా, కొండచరియల కారణంగా నారాయణ్ ఘాట్ - మగ్లింగ్ రోడ్ ప్రస్తుతం బ్లాక్ అయిందని స్థానిక ఎస్పీ భవేష్ రిమాల్ వివరించారు.