2026 నాటికి భోగాపురం పూర్తి చేస్తాం... ఈ బాధ్యత రామ్మోహన్ నాయుడి పైనే ఉంది: చంద్రబాబు
- భోగాపురం విమానాశ్రయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్న సీఎం
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమన్న చంద్రబాబు
- విమానాశ్రయం పూర్తయితే ఎకనమిక్ జోన్‌గా మారుతుందని వెల్లడి
- ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదన్న సీఎం
భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురంకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయన్నారు.
అప్పుడు ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఉత్తరాంధ్ర అద్భుత విజయాన్ని అందించిందని... ఇలాంటి ప్రాంతానికి ఏదైనా చేయాలన్నారు. అందువల్లే జిల్లా పర్యటనలలో భాగంగా తొలుత ఉత్తరాంధ్రకే వచ్చానన్నారు. విశాఖపట్నం - విజయనగరం కలిసిపోతున్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయన్నారు. విశాఖపట్నానికి మెట్రో రావాల్సి ఉందన్నారు. మున్ముందు కుప్పం సహా ఐదు విమానాశ్రయాలు వస్తాయన్నారు.