నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు
- హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్ లో సత్తా చాటిన ఇండియన్ స్టూడెంట్స్
- రెండు విభాగాల్లో అవార్డులు సాధించిన ఢిల్లీ, ముంబై స్కూల్, కాలేజీ విద్యార్థులు
- సొంతంగా తయారు చేసిన రోవర్లను చంద్రుడు, అంగారక గ్రహ నేలను పోలిన ప్రదేశంలో చాకచక్యంగా నడపడమే ఈ పోటీ ఉద్దేశం
అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో టాలెంట్ ప్రదర్శించారు. విద్యార్థులు తాము తయారు చేసిన రోవర్లను చంద్రుడు, అంగారక గ్రహంపై ఎగుడుదిగుళ్లతో ఉండే నేలను పోలిన అర కిలోమీర్ ప్రదేశంలో స్వయంగా నడిపి పరీక్షించారు. మిషన్ పూర్తి చేసేందుకు ఉద్దేశించిన సవాళ్లను అధిగమించేలా పనిచేశారు. రోవర్ల భద్రతా ప్రమాణాలు, డిజైన్లను నాసా ఇంజనీర్లతో కలసి సమీక్షించారు. ఈ పోటీలో అమెరికాలోని డాలస్ కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది.
“విద్యార్థులు భావి శాస్ర్తవేత్తలు, ఇంజనీర్లుగా ఎదిగేందుకు ఈ రోవర్ల డిజైన్ చాలెంజ్ దోహదపడుతుంది. కొత్త ఆలోచనలతో రోవర్ల డిజైన్ ప్రక్రియలో వారు నిమిమ్నమయ్యేలా ప్రోత్సహిస్తుంది” అని నాసాకు చెందిన వెమిత్రా అలెగ్జాండర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలకు ప్రణాళికలు రచించడంలో బాధ్యత తీసుకోబోయే నేటి విద్యార్థులకు ఈ పోటీ ఎంతో విలువైన అనుభవాన్ని అందిస్తుందన్నారు.