KTR: కపటనీతికి కాంగ్రెస్ మారుపేరు.. క్రెడిట్ వాళ్ల ఖాతాలోకి వేసుకుంటున్నారు: కేటీఆర్

Congress govt cheating unemployed youth says KTR
షార్ట్స్‌లో చూడండి
కపటనీతికి కాంగ్రెస్ పార్టీ మారుపేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4 వేలు నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రియాంకాగాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు హామీ ఇచ్చారని... అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట మార్చారని కేటీఆర్ విమర్శించారు. 

ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... కానీ ఆ హామీపై నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000 లకు (2 పేపర్లకు) పెంచిందని దుయ్యబట్టారు. 

బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ వదిలేసిందని అన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని చెప్పారు. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
KTR
BRS
Congress
TS Politics

More Telugu News