అరే యార్.. ఆ పోస్ట్ నా గురించి కాదు: సల్మాన్ ఖాన్
- ఒంటరితనం గురించి సల్మాన్ పెట్టిన పోస్టుతో కంగారుపడ్డ అభిమానులు
- కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించిందన్న సల్మాన్
- కోట్లాది మంది తనతో ఉన్నప్పుడు ఒంటరివాడిని ఎలా అవుతానని ప్రశ్న
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ గత రెండు రోజులుగా ఇంటర్నెట్‌లో ఎంతటి నెగటివ్ హడావుడి సృష్టించిందో.. దానికి అంతే కూల్‌గా ఆయన ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒంటరితనం (Alone vs Lonely) గురించిన ఆయన ఫిలాసఫికల్ పోస్ట్‌తో కంగారుపడ్డ అభిమానులకు, నెటిజన్లకు సల్మాన్ ఖాన్ తన మార్క్ స్టైల్‌లో క్లారిటీ ఇచ్చారు.
"అరే యార్.. నేను నా గురించి ఆ పోస్ట్ పెట్టలేదు. అయినా ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది స్నేహితులు, కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను?" అంటూ సల్మాన్ ఖాన్ నవ్వుతూ నెటిజన్ల కంగారుకు ఫుల్ స్టాప్ పెట్టారు.
నిరంతరం షూటింగ్‌లు, చుట్టూ వందలాది మంది జనాలు ఉండడం వల్ల కొన్నిసార్లు కాస్త విసుగ్గా అనిపిస్తుందని, అందుకే తన కోసం కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించి ఆ ఆలోచనను పంచుకున్నట్లు సల్మాన్ వివరించారు. కనీసం తన ఫొటో కూడా పెట్టకుండా కేవలం టెక్స్ట్ తోనే మీడియా, సోషల్ మీడియా కలిసి దానిని ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ చేసేశాయని ఆయన వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో జరిగిన ఈ హడావుడి చూసి తన తల్లి కూడా కంగారు పడిందని సల్మాన్ వెల్లడించారు. "మీరంతా చేసిన రచ్చ చూసి మా అమ్మ కూడా కంగారుగా నా దగ్గరకు వచ్చి.. ‘ఏమైంది నాన్నా?’ అని అడిగింది. కాబట్టి దయచేసి మీరంతా కూల్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ అంత కంగారుపడాల్సిన విషయం ఏమీ లేదు" అంటూ సల్మాన్ ఖాన్ అందరినీ రిలాక్స్ అవ్వమని కోరారు.