ఏకైక టెస్టు:ఇంగ్లండ్ ను మూడు రోజుల్లోనే మట్టికరిపించిన భారత మహిళల జట్టు

Indian eves finishes England in three days
  • నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్
  • 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ను ఓడించిన భారత్
  • అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన భారత అమ్మాయిలు
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో  ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన భారత అమ్మాయిల బృందం ఇంగ్లండ్ ను మూడ్రోజుల్లోనే మట్టికరిపించింది.

ఈ టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభా సతీశ్ (69), జెమీమా రోడ్రిగ్స్ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (67) అర్ధసెంచరీలు నమోదు చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 49, స్నేహ్ రాణా 30 పరుగులతో రాణించారు. 

అనంతరం ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూలింది. పార్ట్ టైమ్ స్పిన్నర్ దీప్తి శర్మ 5 వికెట్లతో ఇంగ్లండ్ పనిబట్టింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత మహిళల జట్టు 6 వికెట్లకు 186 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 479 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. 

అయితే, రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్ మహిళలు చేతులెత్తేశారు. ఈసారి 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీప్తి శర్మ మరోసారి సత్తా చాటి 4 వికెట్లు తీయగా, పేసర్ పూజా వస్త్రాకర్ 3, రాజేశ్వరి గైక్వాడ్ 2, రేణుకా సింగ్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ హీదర్ నైట్ అత్యధికంగా 21 పరుగులు చేసింది.
Go Back to Shorts
India
England
Women
Test
Navi Mumbai

More Telugu News