Vivek Ramaswamy: ఆన్‌లో ఉన్న మైక్‌తో బాత్రూమ్‌లోకి వివేక్ రామస్వామి .. లైవ్ షోలో సన్నివేశం

Vivek Ramaswamy Forgets To Mute Mic During Toilet Break On X Spaces Elon Musk Reacts
  • ఎక్స్ వేదికగా జరుగుతున్న షోలో వివేక్ రామస్వామికి ఇబ్బందికర పరిస్థితి
  • మైక్ ఆన్‌లో ఉండగానే బాత్రూమ్‌లోకి వెళ్లిన రిపబ్లికన్ నేత
  • విషయాన్ని గుర్తించి వివేక్‌ను అప్రమత్తం చేసిన షో వ్యాఖ్యాత
  • తిరిగొచ్చాక వివేక్ క్షమాపణలు చెప్పిన వైనం
అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన భారత సంతతి నేత వివేక్ రామస్వామి ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కున్నారు. మైక్ ఆన్‌లో ఉన్న విషయం మర్చిపోయి ఆయన బాత్రూమ్‌కు వెళ్లడంతో నీటి చప్పుడు లైవ్‌లో ఉన్న వారందరికీ వినిపించింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వివేక్ ఇటీవల ట్విట్టర్ వేదికగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్‌తో పాటూ ప్రముఖ టెక్ ఎంట్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్, ఇన్ఫోవార్స్ అధినేత అలెక్స్ జోన్స్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 

అయితే, కార్యక్రమం మధ్యలో వివేక్ రామస్వామి ఇప్పుడే వస్తానంటూ అక్కడున్న వారికి చెప్పి బాత్రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో తన మైక్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. దీంతో, బాత్రూమ్‌లో నీటి శబ్దం షో వింటున్న శ్రోతలందరికీ వినిపించింది. ఈ విషయాన్ని షో వ్యాఖ్యత మారియో నాఫుల్ గుర్తుపట్టి వివేక్‌ను హెచ్చరించారు. ‘‘వివేక్, మీ మైక్ ఆన్‌లో ఉన్నట్టు ఉంది. నేను దాన్ని మ్యూట్‌ చేయలేకపోతున్నాను’’ అని పేర్కొన్నారు. 

కాసేపటికి తిరిగొచ్చిన వివేక్ పొరపాటు జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కల్పించుకుని..‘‘మీకు ఇప్పుడు హ్యాపీగానే ఉందనుకుంట’’ అంటూ సరదా కామెంట్ చేశారు. రామస్వామి కూడా అంతే సరదాగా స్పందిస్తూ.. 'అద్భుతంగా ఉంది' అని రిప్లై ఇచ్చారు. ఇక నెటిజన్లు మాత్రం వివేక్‌కు సంఘీభావం ప్రకటించారు. తామూ గతంలో ఇలాంటి పరిస్థితులు అనేకం ఎదుర్కొన్నామని కొందరు చెప్పుకొచ్చారు. లైవ్ ‘స్ట్రీమ్’ అంటే ఇదే అంటూ కొందరు సెటైర్లు పేల్చారు.

More Telugu News

Vivek Ramaswamy
Elon Musk
Viral Videos