ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
- జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు
- సుదీర్ఘ విచారణ అనంతరం సెప్టెంబర్ 5న తీర్పుని రిజర్వ్‌లో ఉంచిన రాజ్యాంగ ధర్మాసనం
- రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు
కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
సోమవారం(నేడు) వెలువడబోయే తీర్పు పట్ల స్థానిక రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా శాంతిభద్రతలకు తమ పార్టీ విఘాతం కలిగించబోదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. తీర్పును ఎవరూ రాజకీయం చేయరాదని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ పేర్కొంది. కాగా 370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్మూకశ్మీర్‌కు చెందిన పార్టీలు గుప్కార్ అలయెన్స్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే.