MD Siraj: ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన సిరాజ్... 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంక

Siraj scalps Sri Lanka top order in Asia Cup final
షార్ట్స్‌లో చూడండి
ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా టాస్ ఓడితే ఓడింది కానీ... మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో శ్రీలంక టాపార్డర్ వణికిపోయింది. కొలంబోలో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే సిరాజ్ రూపంలో ఆ జట్టుకు అగ్నిపరీక్ష ఎదురైంది. నిప్పులు చెరిగే బౌలింగ్ తో విజృంభించిన సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి లంకను చావు దెబ్బ కొట్టాడు. 4 ఓవర్లు ముగిసేసరికి లంక స్కోరు 5 వికెట్లకు 12 పరుగులు అంటే, ఆతిథ్య జట్టు ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని, నేటి మ్యాచ్ కు ముందు విశ్లేషణలు వచ్చాయి. కానీ, టీమిండియా పేసర్లు పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. తొలి ఓవర్లోనే బుమ్రా చక్కని అవుట్ స్వింగర్ తో లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ మొదలైంది. 

తన స్వింగ్ బౌలింగ్ తో లంక బ్యాటర్లకు మిస్టరీగా మారాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (2)ను అవుట్ చేసిన సిరాజ్ ఆ తర్వాత మూడో బంతికి సమరవిక్రమను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక నాలుగో బంతికి సమరవిక్రమను తిప్పిపంపిన సిరాజ్... ఆరో బంతికి ధనంజయ వికెట్ కూడా తీయడంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాతి ఓవర్లోనూ సిరాజ్ జోరు కొనసాగింది. లంక సారథి దసున్ షనక కూడా సిరాజ్ అవుట్ స్వింగర్ కు బోల్తాపడ్డాడు. షనక కూడా డకౌటే. 

ప్రస్తుతం లంక 6 ఓవర్ల అనంతరం 6 వికెట్లకు 13 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 5, వెల్లలాగే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. లంక కోల్పోయిన 6 వికెట్లలో సిరాజ్ ఒక్కడే 5 వికెట్లు తీయడం విశేషం.
Go Back to Shorts
MD Siraj
Team India
Sri Lanka
Asia Cup Final

More Telugu News