ఈ మూడు యోగాసనాలతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చట!
- రోజూ వేయడం ద్వారా గుండె పదిలం
- ఇటీవలి కాలంలో పెరుగుతున్న హృద్రోగాలు
- మారిన జీవనశైలి వల్లేనంటున్న నిపుణులు
ఉత్థిత త్రికోణాసనం ఎలా వేయాలంటే..
నేలపై నిటారుగా నిలబడి కాళ్లను కొద్దిగా ఎడంగా చాపాలి. కుడికాలిని మరింత దూరం జరిపి పాదాన్ని కుడిచేతితో అందుకోవాలి. ఎడమ చేతిని నిట్టనిలువుగా పైకి లేపి ఉంచాలి. వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండి ఆపై సాధారణ స్థితికి రావాలి. అనంతరం మళ్లీ ఎడమ కాలితో ఇదేవిధంగా చేయాలి. ఇలా రోజూ నాలుగైదు సార్లు చేస్తే గుండె పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పశ్చిమోత్తానాసనం వేసే విధానం..
నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి.. తర్వాత ముందుకు వంగి పాదాలను పట్టుకోవాలి. తలను పూర్తిగా కిందికి వంచి కాళ్లపై ఆనించాలి. వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండి పైకి లేవాలి. ఈ ఆసనం కూడా రోజూ నాలుగైదు సార్లు వేయాలి.

అర్ధ మత్య్సేంద్రాసనం..
నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. ఎడమకాలిని తీసి కుడికాలి మీదుగా వేసి.. ఎడమకాలి పాదం కుడికాలి మోకాలికి అవతలివైపు వచ్చేలా వేయాలి. ఇప్పుడు కుడిచేతితో ఎడమ మోకాలిని కుడివైపుకు వంచినట్లు ఉంచాలి. తలను ఎడమ భుజం వైపు తిప్పి చూడాలి. ఎడమ చేతిని నేలపై ఆనించి వీపు నుంచి దూరంగా జరపాలి. ఈ భంగిమలో కొంతసేపు ఉండి సాధారణస్థితికి రావాలి. ఆపై కుడివైపు కూడా ఇలాగే చేయాలి.