Pakistan: సీమా హైదర్‌ను పాక్ పంపించకుంటే 26/11 తరహా ఉగ్రదాడి: పోలీసులకు బెదిరింపు కాల్

Mumbai Police receive 2611 like terrorist attack threat for seema haider
షార్ట్స్‌లో చూడండి
పబ్ జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. అతనినే పెళ్లి చేసుకోవడానికి సరిహద్దు దాటి భారత్ వచ్చిన పాక్ జాతీయురాలు సీమా గులాం హైదర్ ను తిరిగి తమ దేశానికి పంపించాలని, లేదంటే 26/11 తరహా ఉగ్రవాద దాడి పునరావృతమవుతుందని ముంబై పోలీసులకు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అతను ఉర్దూలో మాట్లాడాడు. కానీ ఇది ఫేక్ బెదిరింపుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెదిరింపు సందేశం పంపించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముంబై తరహా దాడులకు సిద్ధంగా ఉండండి... దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి... అంటూ గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీసులు... యూపీ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు.

నలుగురు పిల్లలు కలిగిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కు పబ్ జీ గేమ్ ద్వారా భారత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి... అతనిని పెళ్లి చేసుకోవడానికి భారత్ లో అక్రమంగా ప్రవేశించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ భారత్ లో అక్రమంగా ప్రవేశించినందుకు గాను సీమా హైదర్ ను, ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు 22 ఏళ్ల సచిన్ మీనా, అతని తండ్రిని గ్రేటర్ నోయిడా పోలీసులు ఈ నెల ప్రారంభంలో అరెస్ట్ చేశారు. అయితే వీరు ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సీమా హైదర్ పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో గల రింద్ హజానా గ్రామ నివాసిగా గుర్తించారు. పబ్ జీ ద్వారా సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ నుండి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. ఎలాంటి వీసా లేకుండానే ఆమె గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నెల రోజుల పాటు ఉన్నది. మరోవైపు, సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అయి ఉండవచ్చునని కూడా అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణలను సీమా, సచిన్ మీనా ఖండించారు.
Go Back to Shorts
Pakistan
India
mumbai

More Telugu News